ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్మశాన వాటికతో పోల్చడం ఆయన దురహంకారానికి పరాకాష్ట అని, చంద్రబాబు తక్షణమే పేద ప్రజలకు క్షమాపణ చెప్పాలని స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులు ఇందుకూరి రఘురాజు డిమాండ్ చేశారు. మే 18వ తేదీన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు శృంగవరపుకోట పర్యటనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంగళవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా ఎమ్మెల్సీ ఇందుకూరి రఘరాజు ఆధ్వర్యంలో పట్టణంలో స్థానిక శ్రీనివాస థియేటర్ వద్దగల రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి భారీ ర్యాలీగా చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దేవీ జంక్షన్ వద్ద మానవహారంగా ఏర్పడి చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇందుకూరి మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో పేద ప్రజలకు ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదనే సంగతి ఆయన గుర్తుంచుకోవాలని అన్నారు. నేడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల సంక్షేమమే పరమావధిగా తిరుగులేని పరిపాలన చేస్తుంటే చంద్రబాబు తన అక్కసును వెళ్ళగక్కడం చంద్రబాబు మానసిక స్థితికి అద్దం పడుతోందని అన్నారు. రానున్న 2024 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అవమానకర రీతిలో భూస్థాపితం కావడం ఖాయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కొప్పల వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడు బాబు, ఎస్ కోట ఎంపీపీ సండి సోమేశ్వరరావు, జడ్పిటిసి వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ ఇందుకూరి సుధారాణి, పి వెంకటరమణ, శృంగవరపుకోట మేజర్ పంచాయతీ సర్పంచ్ సంతోషి కుమారి తదితర ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.