వృద్ధాప్యంతో ఇబ్బంది పడుతున్న తనను కుమార్తె మరింత అగచాట్లు పాలు చేస్తోందని తరచూ కొడుతూ ఇంట్లో ఉండనీయకుండా వేధిస్తోందని ఎమ్మెల్యే ఎదుట వృద్ధురాలు ఆవేదనకు గురయ్యారు. వాలంటీర్లకు సత్కారంలో భాగంగా నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడుకు ఎమ్మెల్యే సుచరిత మంగళవారం వచ్చారు. తొలుత స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో ఉన్న ఎమ్మెల్యేను కొత్త ఆదిలకీë అనే వృద్ధురాలు కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు. తన భర్త చనిపోయాడని, పెద్ద కుమార్తె తన భర్త, బిడ్డలతో తనవద్దే ఉంటోందని చెప్పారు. ఇప్పటికే వయస్సు మళ్లిన తనను జాగ్రత్తగా చూసుకోవాల్సిన కుమార్తె హింసలు పెడుతోందని, కాళ్లపైనా కొట్టి ఉంట్లో ఉండనీయడం లేదని వాపోయారు. దీనిపై తాను పోలీసులను గతంలోనే సంప్రదించానని, వారు ఆమెను పిలిచి మాట్లాడినా పరిస్థితిలో మార్పు రావడం లేదని చెప్పారు. ఈ వయసులో తానెక్కడికి వెళ్లగలనని, తనకు న్యాయం చేయాలని కన్నీటితో చేతులు జోడించి ఎమ్మెల్యేను వేడుకున్నారు. ఎమ్మెల్యే స్పందిస్తూ వృద్ధురాలికి వెంటనే న్యాయం చేయాలని స్థానిక ఎస్‌ఐకు చెప్పారు.