నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాను దూరంగా ఉంటున్నట్టు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. పార్లమెంటుపై స్పీకర్ కే సర్వాధికారాలు ఉంటాయని, కొత్త పార్లమెంటు భవనాన్ని స్పీకర్ ప్రారంభించాలని తెలిపారు. కొత్త పార్లమెంటును స్పీకర్ ప్రారంభిస్తేనే తాను పాల్గొంటానని ఒవైసీ స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి హాజరు కాకూడదని 19 పార్టీలు తీర్మానం చేశాయి. ఈ మేరకు అన్ని పార్టీలు కలసికట్టుగా ప్రకటన చేశాయి. ప్రధాని మోదీ పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం చేస్తుండడం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించడమేనని, అంతకంటే ఎక్కువగా ప్రజాస్వామ్యంపై నేరుగా దాడి చేయడమేనని అన్ని పార్టీలు ముక్తకంఠంతో నినదించాయి. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు మోదీకి కొత్త కాదని విమర్శించాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ముర్మును పూర్తిగా పక్కనబెట్టడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, ఇది ఆమోదయోగ్యం కాదని విపక్షాలు పేర్కొన్నాయి.