రాజధాని అమరావతి ప్రాంతంలో పాము కాటుకు గురై ప్రకాశం జిల్లా కు చెందిన కానిస్టేబుల్ పవన్ కుమార్ ప్రాణాలు కోల్పోవడం విచారకరమని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. డ్యూటీలో ఉన్నవారికి వసతులు లేమి ఉన్న విషయం ఈ సంఘటన తేటతెల్లం చేస్తోందని, ఇతర ప్రాంతాలనుండి విధుల నిమిత్తం వచ్చే వారికి వసతి, సదుపాయాలు ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షించాల్సి ఉన్నా ఆ నిబంధనలు పాటించలేదని విమర్శించారు. ప్రాణాలు కోల్పోయిన పవన్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని తెలిపారు. పవన్ కుమార్ కుటుంబానికి తగినంత నష్టపరిహారం తక్షణం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు.