పార్వతీపురం ఐటిడిఏ పరిధిలోగల గిరిజన సంక్షేమ టీచర్ల బదిలీలపై వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులతో గిరిజన సంక్షేమశాఖ డీడీ సూర్యనారాయణ సోమవారం తన కార్యాలయంలో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం లో గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి విడుదల చేసిన ఉత్తర్వులలో పేర్కొన్న నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలని సంఘ నేతలు డీడీ ని కోరారు. ముఖ్యంగా బాలికల పాఠశాలల్లో మహిళా టీచర్లను మాత్రమే నియమించడం, స్పౌజ్, ప్రిఫరెన్షియల్ క్యాటగిరి అభ్యర్థులకు నిబంధనల ప్రకారం పాఠశాలలను కోరుకునే అవకాశం కల్పించడం, టీచర్ల ఖాళీలను బ్లాక్ చేయకుండా అన్ని ఖాళీలు ప్రదర్శింప చేయటం తదితర అంశాలపై చర్చించడం జరిగింది. సంఘ నాయకులు ప్రస్తావించిన అన్ని అంశాలపై డిడి సూర్యనారాయణ సానుకూలంగా స్పందించారని, నిబంధనల ప్రకారమే బదిలీల కౌన్సిలింగ్ ఈనెల 30న నిర్వహిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లా బాలకృష్ణారావు, పీఆర్టియూ జిల్లా ప్రధాన కార్యదర్శి కాగాన విజయ్, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు టి రమేష్, ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ నాయకులు చక్రపాణి, ఏపీటీఎఫ్ మహిళా నేత ప్రమీల, కార్యాలయ సూపరింటెండెంట్ పద్మజ తదితరులు పాల్గొన్నారు.