తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో బుధవారం ఉదయం గోవిందుడు వరద హస్తంతో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 9-30 గంటల నుండి 10-30 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనాలతో విశేషంగా అభిషేకం చేశారు.