మిషన్ వాత్సల్య పథకం అర్హులందరికీ అందేలా చూడాలని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆదేశించారు. సాంకేతిక కారణాలతో ఈ పథకం ఎవరికీ దూరం కాకూడదని స్పష్టం చేశారు. జెడ్‌పి సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన 1, 2, 4, 7 స్థాయి సంఘ సమావేశాలకు ఆయన అధ్యక్షత వహించారు. మిషన్ వాత్సల్స్య పథకానికి విజయనగరం జిల్లాలో సుమారు 14, 000, పార్వతీపురం మన్యం జిల్లాలో సుమారు 9, 500 ధరఖాస్తులు వచ్చాయని, ఆయా జిల్లాలో ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్లు తెలిపారు. కొన్ని రకాల ధృవపత్రాలను జత చేయకపోవడంతో, వీటిలో కొన్నితిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని అన్నారు.
అవసరమైన ధృవపత్రాలను జతచేయడానికి దరఖాస్తు దారులకు మరో అవకాశం ఇవ్వాలని ఛైర్మన్ శ్రీనివాసరావు సూచించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను ఆయా మండలాల ఎంపిపిలు, జెడ్‌పిటిసీలు, ఎంఎల్ఏలతోపాటు సచివాలయాలకు కూడా అందించాలని ఆదేశించారు. భర్త వదిలేసిన, విడాకులు తీసుకోని మహిళలకు విఆర్ఓ లేదా ఇతర అధికారులనుంచి దృవీకరణ తీసుకొని, దరఖాస్తుకు జతచేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం ద్వారా పేద ప్రజలకు మేలు చేకూర్చాలని ఛైర్మన్ కోరారు. ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమంపై మరింత విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజల చెంతకు చేర్చాలని, దీనికోసం నెల రోజుల ముందుగానే గ్రామాల వారీగా వైద్యులు వెళ్లే షెడ్యూల్‌ను ప్రకటించాలని ఆదేశించారు. గ్రామంలోకి డాక్టర్ వస్తున్న విషయాన్ని ముందుగానే గ్రామాల్లో దండోరా వేయించాలని, ఆశా ఎఎన్ఎంల ద్వారా కూడా సమాచారం పంపించాలని అన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే వైద్య పరీక్షల వివరాలను ప్రతీ వెల్‌నెస్ సెంటర్‌లో ఫెక్సీల ద్వారా ప్రజలకు తెలియజేయాలని సూచించారు. వ్యవసాయ పరికరాలను ఎక్కడ తక్కువ ధరకు లభిస్తే అక్కడ కొనుక్కొనే అవకాశం రైతుకు కల్పించాలని ఛైర్మన్ కోరారు.