ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరినీ రెగ్యులర్ చేస్తానని హామీలిచ్చిన ప్రస్తుత సీఎం జగన్.. ఇప్పుడు జీతాల్లో కోతలు పెట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇంతకాలం 12నెలల జీతం అందుకున్న కాంట్రాక్టు అధ్యాపకులకు ఇకపై 11 నెలల జీతమే ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తేల్చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న 316 మంది కాంట్రాక్టు లెక్చరర్లు, 144 మంది వర్క్‌షాప్ అటెండెంట్ల కాంట్రాక్టును ప్రభుత్వం రెన్యువల్ చేసింది. జూన్ 1 నుంచి 2024 ఏప్రిల్ 30 వరకు వారికి కాంట్రాక్టు అమల్లో ఉంటుందని తెలిపింది. అంటే మే నెల జీతం వారికి అందదు. ఇంటర్మీడియట్ కాలేజీల్లో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్ల విషయంలోనూ ఇటీవల ఇలాగే 11 నెలలకు కాంట్రాక్టును రెన్యువల్ చేశారు. అయితే, 12 నెలల పాటు జీతం ఇచ్చేలా ఉత్తర్వులు సవరించాలని ఏపీ పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం నేతలు ఏఆర్ గోవర్థన్ నాయుడు, బి.కృష్ణ, పి.సాయిరాజు డిమాండ్ చేశారు.