ఉద్యోగుల యాభై డిమాండ్లు పరిష్కరించటానికి రాష్ట్ర ప్రభుత్వానికి జూన్ 10వ తేదీ వరకు డెడ్‌లైన్ విధిస్తున్నామని, ఈ లోపు సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రరూపం దాల్చుతుందని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఓబులేసు హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో ప్రభుత్వ ఉద్యోగులు మంగళవారం సామూహిక నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. విజయవాడ ధర్నాచౌక్‌లో నిర్వహించిన నిరాహార దీక్షలో బొప్పరాజు పాల్గొనగా.. ఆయనకు ఓబులేసు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ.. ఉద్యమం తీవ్రరూపం దాల్చుతుందన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఏసీబీ దాడులకు పురికొల్పుతోందని ఆరోపించారు. ఉద్యోగుల 50 డిమాండ్లను పరిష్కరించే వరకు ఉద్యమం ఆగదని, తుది నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అసన్నమైందన్నారు.