ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. మచిలీపట్నం, గుడివాడలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గుడివాడ బస్టాండ్ జలమయం కావడంతో మాజీ ఎమ్మెల్యే రావి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాలుగేళ్ల పాలనలో గుడివాడలో అభివృద్ధి శూన్యమన్నారు. బుధ, గురువారాల్లో కోస్తాతీరం వెంబడి ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. జూన్ 1వ తేదీ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుండటంతో వర్షాలు వ్యవసాయ పనులకు ఉపయోగంగా ఉంటాయని, వేసవి దుక్కులు దున్నేందుకు భూమి అనుకూలంగా మారుతుందని రైతులు పేర్కొన్నారు.