సమసమాజ స్థాపనకు జిల్లా అధికారులు, పోలీసులు, ఎస్సీ, ఎస్టీ పర్యవేక్షణ కమిటీ సభ్యులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎల్. శివశంకర్ కోరారు. నరసరావుపేట జిల్లాస్థాయి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ కమిటీ సమీక్ష సమావేశం కలెక్టరేట్‌లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పందన హాలులో గురువారం నిర్వహించారు. జిల్లాల విభజన తర్వాత గతేడాది డిసెంబర్‌లో తొలిసారి జిల్లాస్థాయి సమావేశం నిర్వహించామని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఓబుల నాయుడు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అంటరానితనం పలు సామాజిక తరగతుల జీవన విధానాన్ని, స్వేచ్ఛను దెబ్బతీస్తోందని, అంటరానితనం, వివక్షను రూపుమాపడానికి జిల్లా అధికారులు, పోలీసులు, కమిటీ సభ్యులు కృషి చేయాలని, ప్రజల్లో చైతన్యం పెంచాలని చెప్పారు. పల్నాడు జిల్లా ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 157 ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదవగా వాటి పురోగతి, బాధితులకు జరిగిన న్యాయం, ప్రభుత్వం నుంచి అందిన పరిహారం, కేసుల దర్యాప్తు తదితర అంశాలపై సమీక్షించారు.