ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం అప్పన్న భక్తులపై రాష్ట్ర ప్రభుత్వం కేశ ఖండన భారం మోపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో కేశ ఖండన శాలల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు రూ.20,000 కనీస కమిషన్ హామీ అమలులో భాగంగా టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ.25 ఉన్న టికెట్ ఇకపై రూ.40కి పెరిగింది. పెరిగిన ధరలు శుక్రవారం నుంచి అమలు కానున్నాయి.
అయితే టికెట్ ధర పెంచడాన్ని సింహాచలం ట్రస్ట్ బోర్డు సభ్యులు తప్పుబడుతున్నారు. సింహాచలం ట్రస్ట్ బోర్డ్ సభ్యులకు తెలియకుండా కేశఖండనశాల టికెట్లు పెంచడం సరికాదని బోర్డు సభ్యులు తెలిపారు. మరోవైపు కేశఖండన టికెట్ ధర ఒక్కసారిగా రూ.15 పెంచడంపై భక్తుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.