ఢల్లీ మద్యం కేసు దేశంలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియాకు స్వల్ప ఊరట దక్కింది. ఆయన ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను చూసి రావడానికి ఢిల్లీ హైకోర్టు ఆయనకు కొన్ని గంటల పాటు అనుమతి ఇచ్చింది. శనివారం తన నివాసంలో ఉదయం పది గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య భార్య సీమాను చూసి రావొచ్చునని హైకోర్టు శుక్రవారం తెలిపింది.
సిసోడియాను తన భార్యను చూడడానికి వారి నివాసానికి తీసుకెళ్లాలని జస్టిస్ దినేష్ కుమార్ శర్మ తీహార్ జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ఇందుకు కొన్ని షరతులు కూడా విధించింది. సిసోడియా తన కుటుంబ సభ్యులతో తప్ప మీడియాతో లేదా మరే ఇతర వ్యక్తులతో మాట్లాడరాదని తెలిపింది. ఫోన్ లో సంభాషించరాదని, ఫోన్ లేదా ఇంటర్నెట్ యాక్సెస్ చేయరాదని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో రెగ్యులర్ బెయిల్, మధ్యంతర బెయిల్ కోసం సిసోడియా దాఖలు చేసిన పిటిషన్‌లను హైకోర్టు విచారించింది. అనంతరం తన ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్, మల్టిపుల్ స్కిరోసిస్ అనే అరుదైన సమస్యతో బాధపడుతున్న సీమా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమెకు చికిత్స అందించారు.
ఈ నేపథ్యంలో సిసోడియా మధ్యంతర బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, హైకోర్టు అనుమతినిచ్చింది. తన కొడుకు చదువుల నిమిత్తం విదేశాల్లో ఉన్నాడని, అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని సిసోడియా పిటిషన్ లో పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యతో రోజు విడిచి రోజు గంట పాటు వీడియో కాల్ ద్వారా మాట్లాడుకోవచ్చునని హైకోర్టు సూచించింది.