వేసవిలో శ్రీవారి ఆలయంతోపాటు క్యూలైన్లలో భక్తులకు సేవలందించేందుకు యువకులు ముందుకు రావాలని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఆదివారం ఉదయం డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమంలో భాగంగా భక్తులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘వేసవి సెలవుల నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకుని జూలై 15వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేశాం. సుప్రభాత సేవ విచక్షణ కోటా రద్దు చేశాం. అధిక రద్దీ నేపథ్యంలో భక్తులు ఓపికతో ఉండి శ్రీవారిని దర్శించుకోవాలి. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల భద్రత కోసం ఘాట్ల ప్రయాణంలో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేశాం. టీటీడీ చరిత్రలో తొలిసారిగా అధికారులు, ఉద్యోగులందరూ సుందర తిరుమల-శుద్ధ తిరుమల పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి రూ.600 కోట్ల విలువైన 10 ఎకరాల భూమిని మహారాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి అప్పగించింది. ఇందులో రేమాండ్స్ అధినేత గౌతమ్ సింఘానియా రూ.వంద కోట్లతో ఆలయ నిర్మాణానికి ముందుకు రాగా, ఈ నెల 7వ తేదీన భూమి పూజ నిర్వహిస్తున్నాం. జమ్మూలోని మజీన్ గ్రామంలో నిర్మించిన శ్రీవారి ఆలయ మహా సంప్రోక్షణ ఈ నెల 8వ తేదీన జరుగుతుంది. తిరుపతిలోని పద్మావతి హృదయాలయంలో 20 నెలల వ్యవధిలోనే 1,450 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు నిర్వహించాం. మే నెలలో 23.38 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా, హుండీ కానుకలు రూ.109.99 కోట్లు లభించాయి’ అని ఈవో వివరించారు.