‘రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు అయోమయ పరిస్థితుల్లో ఉంది. సుపరిపాలన పేరుతో అరాచక పాలన సాగిస్తోంది. ఎన్నడూ లేనివిధంగా రాజకీయాల్లో నైతిక విలువలు పడిపోయాయి. రాజ్యాంగ విరుద్ధమైన పాలన కొనసాగుతోంది. ఇసుక, లిక్కర్ మాఫియాలు పేట్రేగిపోతున్నాయి. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోయింది. సంక్షేమం పేరుతో కోట్లాది రూపాయలు అప్పులు తెచ్చి ఓట్లు కొనుగోలు చేసేందుకు యత్నిస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వం ఉంటే రాష్ట్ర ప్రజలకు తీరని నష్ట్రం వాటిల్లుతుంది. చేయి చేయి కలుపుదాం.. సమష్టిగా దుర్మార్గ పాలన ముగింపునకు నాంది పలికే సమయం అసన్నమైంది’ అని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి విమర్శలు గుప్పించారు. ఆదివారం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వంలో శాసనసభ నుంచి గ్రామ పంచాయతీల సమావేశాల వరకు దేనికీ విలువ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.