శ్రీకాళహస్తిలో ఈ నెల 10వ తేదీన భారతీయ జనతా పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా ఈ సభలో పాల్గొనున్నారు. ఇందులో భాగంగా సభావేదికతో పాటు ఇతర ఏర్పాట్లను సోమవారం ఉదయం బీజేపీ నేతలు పరిశీలించారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, రాష్ట్ర బీజేపీ ఇంచార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి, తిరుపతి జిల్లా అధ్యక్షులు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, రాష్ట్ర మీడియా ప్రతినిధి కోలా ఆనంద్ తదితరులు సభా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో బీజేపీ నాయకత్వం కలిసి చర్చించడాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలతో అన్ని పక్షాలు చర్చిస్తాయని చెప్పారు. వచ్చే పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో వారి కలయిక ఉండవచ్చని చెప్పుకొచ్చారు. ఈ కలయికను రాజకీయ కోణంలో చూడవద్దని సత్యకుమార్ పేర్కొన్నారు.