లైంగిక వేధింపుల విషయంలో ముంబయిలోని సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మహిళా సహోద్యోగిని ఉద్దేశించి ఫిగర్ బాగుందని చెప్పడం కూడా వేధింపులగానే పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది. బాగా మెయింటెయిన్ చేస్తున్నారనడం, డేటింగ్‌కు రమ్మనడం కూడా అశ్లీల పదజాలం కిందకే వస్తాయని కోర్టు స్పష్టం చేసింది. ఇటువంటి మాటలు ఆమె గౌరవానికి భంగం కలిగిస్తాయని, ఈ వ్యాఖ్యలు చేసిన వారు ముందస్తు బెయిల్‌కు అర్హులు కారని తేల్చిచెప్పింది. నిందితులను కస్టడీలోనే విచారించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు సెషన్స్ కోర్టు జడ్జి ఏ.జడ్. ఖాన్ ఉత్తర్వులు వెలువరించారు.
ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న మహిళను అక్కడ అసిస్టెంట్ మేనేజర్(42), సేల్స్ మేనేజర్(30) లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. ఫిగర్ బాగుందని, డేట్‌కు వస్తావా? అంటూ కామెంట్లు చేయడంతో ఆమె ఏప్రిల్ 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో వారిపై లైంగిక వేధింపులు సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. నిందితులు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించగా.. అందుకు సెషన్స్ కోర్టు నిరాకరించింది.
‘‘ఈ కేసులో పలు కోణాలున్నాయి.. వారిని కస్టడీలోనే విచారించాల్సి ఉంటుంది. లేకుంటే దర్యాప్తు అధికారికి ఉండే విచారించే హక్కును కాలరాసినట్టు అవుతుంది. చివరకు అది ప్రాసిక్యూషన్‌పై ప్రభావం చూపుతుంది’’అని న్యాయమూర్తి పేర్కొన్నారు. పనిచేసే చోట మహిళా ఉద్యోగిని వేధించడం తీవ్రమైన విషయమని వ్యాఖ్యానించారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం మార్చి 1 నుంచి ఏప్రిల్ 14 మధ్య అసిస్టెంట్ మేనేజర్, సేల్స్ మేనేజర్లు అభ్యంతరకమైన పదాలతో వేధించారు. ‘మేడమ్ మీరు బాగా మెయింటెయిన్ చేస్తున్నారు.. మీ ఫిగర్ చాలా అందంగా ఉంటుంది... నాతో బయటకు వచ్చే ఉద్దేశం ఉందా’ అని అన్నట్టు ఫిర్యాదులో బాధితురాలు ఆరోపించారు.