ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై అనేక అనుమానాలు ఉన్నాయని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. సోమవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం కూడా రైలు ప్రమాదంలో కుట్రకోణంపై ఆరా తీస్తోందని తెలిపారు. అవసరమైతే ఒడిశా రైల్వే ప్రమాదంపై సీబీఐతో దర్యాప్తు చేస్తామని చెప్పారు. రైలు ప్రమాదానికి కారణమైన వారిని గుర్తించి కఠిణంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. వందల మంది ప్రాణాలు కోల్పోవడంపై కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారన్నారు. ఒడిశా రైలు ప్రమాదం కారణంగా ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలనపై దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలు నిరాడంబరంగా నిర్వహిస్తామన్నారు. ఈ నెల 8న హోంమంత్రి అమిత్ షా విశాఖ పర్యటన కూడా నిరాడంబరంగా జరుగుతుందని తెలిపారు. అమిత్ షా విశాఖ పర్యటనలో కేవలం కేంద్రం చేపతుడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపైనే ప్రసంగించనున్నట్లు ఎంపీ జీవీఎల్ వెల్లడించారు.