ఆంధ్రప్రదేశ్ కు పార్లమెంట్ సాక్షిగా ఇస్తామన్న ప్రత్యేక తరగతి హోదా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ 2017 జనవరి 30వ తేదీన సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో నాయకులపై విశాఖ 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. కేసు పూర్వ పరాలు పరిశీలించిన విశాఖ 2 వ అదనపు చీఫ్ మెట్రో పాలిటిన్ కోర్టు న్యాయమూర్తి కె వి ఎల్ హిమబిందు కేసును సోమవారం కొట్టివేసారు. దీనితో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణ మూర్తి, జీవీఎంసీ సీపీఐ ప్లోర్ లీడర్ ఎ జె స్టాలిన్ లపై కేసు నెం 483/2018 నుండి విముక్తి లభించింది. ఈ సందర్భంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిస్కారం కోసం పోరాటాలు నిర్వహించిన సీపీఐ కి గణనీయమైన చరిత్ర ఉందని తెలిపారు. ఇది పార్టీ ప్రజా పోరాట విజయంగా ఆయన అభివర్ణించారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ కి రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.