పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద మృతుల్లో తమ రాష్ట్రానికి చెందిన బాధిత కుటుంబాల్లోని ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. అలాగే, అవయవాలను కోల్పోయినవారి ఇంటిలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు. దీదీ మీడియాతో మాట్లాడుతూ.. రైలు ప్రమాదంలో తీవ్ర గాయాలై బాధపడుతున్న వారికి నగదు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. బెంగాల్‌కు చెందిన ప్రయాణికుల్లో 206 మంది గాయపడ్డారని, ఒడిశాలోని వేర్వేరు ఆసుపత్రుల్లో వారు చికిత్స పొందుతున్నారని తెలిపారు. వీరిలో 33 మంది పరిస్థితి విషమంగా ఉందని, వీరికి కటక్ ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతున్నట్టు వెల్లడించారు.
మంగళవారం వారిని పరామర్శించడానికి మమతా బెనర్జీ ఒడిశాకు వెళ్లనున్నారు. రైలు ప్రమాదం జరిగిన తర్వాత బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తక్షణమే స్పందించి.. సహాయక చర్యల కోసం సిబ్బంది, వైద్యులు, అంబులెన్స్‌లను ఒడిశాకు పంపారు. ఆ రాత్రంతా తన నివాసం నుంచి సహాయక చర్యలను పర్యవేక్షించారు. మర్నాడు ఘటనా స్థలికి చేరుకుని అక్కడ సహాయక చర్యలు గురించి ఆరా తీశారు. బాలాసోర్ రైలు ప్రమాదంలో చనిపోయినవారిలో ఎక్కువ మంది బెంగాల్ ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది.
మృతుల కుటుంబాలకు నష్టపరిహారం, ఉద్యోగ నియామక పత్రాలను మమతా బెనర్జీ బుధవారం అందజేయనున్నారు. ప్రమాదం విషయంలో ఎటువంటి రాజకీయాలకు తావివ్వరాదని, గాయపడిన ప్రయాణికులకు, వారి కుటుంబాలకు అన్ని విధాలా సాయం చేస్తానని బెంగాల్ ముఖ్యమంత్రి తెలిపారు. అంతకు ముందు రోజు రైలు ప్రమాదం కారణంగా నాలుగు రోజుల తన డార్జిలింగ్ పర్యటనను మమతా బెనర్జీ రద్దు చేసుకున్నారు. ఈ ఏడాది జరిగే పంచాయతీ ఎన్నికల విషయంలో అన్ని పార్టీల నాయకులతో ఆమె సమావేశం కావాల్సి ఉందని సచివాలయం వర్గాలు తెలిపాయి. అంతేకాదు, మెరుగైన చికిత్స అవసరమైన క్షతగాత్రులను కోల్‌కతా లేదా ఇతర రాష్ట్రాలకు పంపాలని కూడా దీదీ భావిస్తోన్నట్టు పేర్కొన్నాయి.