దౌసా జిల్లా సికిందరా పంచాయతీ సమితి పరిధిలోని గంగద్వాడీ గ్రామంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి సహాయక శిబిరాన్ని నిర్వహించారు. ఈ సమయంలో ఆ గ్రామానికి చెందిన కైలాశ్ మహావార్ అలియాస్ కల్లు మహావార్ అనే వ్యక్తి వచ్చి అధికారులకు ఓ విజ్ఞాపన పత్రాన్ని అందజేశాడు. తన వయసు 45 ఏళ్లని, ఇంకా వివాహం కాలేదని అందులో వాపోయాడు. తనకో అమ్మాయిని వెతికిపెడితే పెళ్లి చేసుకుని స్థిరపడతానని కోరాడు. అంతేకాదు, తనకు భార్యగా రాబోయే అమ్మాయికి ఎలాంటి లక్షణాలు ఉండాలో మహావార్ అందులో పేర్కొన్నాడు. వీలైనంత త్వరగా తన ఇంటికి ఒక ఇల్లాలిని చూసిపెట్టాలని మొరపెట్టుకున్నాడు.
అంతేకాదు, తనకు కాబోయే భార్యలో ఇలాంటి లక్షణాలు ఉండాలని చెప్పాడు.
* అమ్మాయి వయసు 30 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి.
* తప్పనిసరిగా సన్నగా ఉండాలి.
* నాయకత్వ లక్షణాలు ఉండాలి.
* న్యాయంగా వ్యవహరించాలి.
ఇక, వైరల్ అయిన లేఖను స్థానిక తాహసీల్దార్ హరికిషన్ సైనీ గ్రామ పట్వారీకి పంపి చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, శిబిరంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో తాను ఆ లేఖను వివరంగా చదవలేదన్నారు. వెంటనే ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నట్టు చెప్పారు. స్థానిక అధికారులు సోమవారం ఆ గ్రామాన్ని సందర్శించి సమస్యపై విచారణ చేపట్టారు. అయితే, ఆ వ్యక్తి మానసిక పరిస్థితి సక్రమంగా లేదని, శిబిరానికి వెళ్లి ఎవరితో లేఖ రాయించాడని గుర్తించారు.