ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు సకాలంలో సక్రమంగా అందక రోగులు ఇబ్బందులు ఎదుర్కొం టుంటారు. ఈ తరహా సమస్యలకు చెక్ చెప్పేందుకు రోగుల నుంచి సేవలపై ఫీడ్ బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్) అధికారులు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక పత్రాన్ని (ఫీడ్ బ్యాక్ ఫామ్) రూపొందించారు. దీని ద్వారా రోగులకు ఎదురయ్యే ఇబ్బందులను గుర్తించి పరిష్కరించే ప్రయత్నం చేస్తామంటున్నారు. విమ్స్ అధికారులు రూపొందించిన ఫీడ్ బ్యాక్ ఫామ్‌ను రోగులు, వారి బంధువులకు అందిస్తారు. డిశ్చార్జ్ అయ్యేవారు ఈ పత్రాన్ని నింపి, ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన బాక్స్‌లో వేయాల్సి ఉంటుంది. ఒకవేళ నిరక్షరాస్యులైతే ఇతరుల సహాయం తీసుకోవచ్చు. ఈ ఫామ్‌లో రోగి పేరు, వయసు, విభాగం, అడ్మిషన్, డిశ్చార్జ్ తేదీతోపాటు ఆస్పత్రి గురించి ఎలా తెలిసింది, ఆస్పత్రికి వచ్చినప్పటి నుంచి బెడ్ కేటాయింపునకు తీసుకున్న సమయం, అత్యవసర సమయంలో వైద్యులు అందించిన చికిత్స పట్ల సంతృప్తిగా ఉన్నారా? , డిశ్చార్జ్ అయ్యేంత వరకు అందిన సేవలు, ఇతర పరీక్షలు, వైద్య సేవలకు డబ్బులు ఏమైనా అడిగారా? , పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు సమయానికి ఇచ్చారా? , డాక్టర్, నర్సింగ్ సిబ్బంది సేవలు ఎలా ఉన్నాయి? , ఆహార నాణ్యత, సమయ పాలన, పారిశుధ్యం, మరుగుదొడ్లు శుభ్రత, పారామెడికల్ స్టాఫ్ సేవలు, హౌస్ కీపింగ్, ఆరోగ్యశ్రీ సిబ్బంది సేవలు, తాగునీటిపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతోపాటు ఇంకా ఏదైనా చెప్పాలనుకుంటే ఈ పత్రంలో రాసే అవకాశం కల్పించారు. ఎక్కువ మంది చెప్పే సమస్యలపై దృష్టి. ఎక్కువ మంది రోగులు తెలిపే సమస్యలపై దృష్టిసారించి, వాటిని పరిష్కరించేందుకు అవకాశముంటుందని విమ్స్ డైరెక్టర్ రాంబాబు తెలిపారు. విమ్స్‌కు వచ్చే రోగులకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొద్దిరోజుల్లో విమ్స్ విస్తరణ పనులు ప్రారంభం కానున్నాయని, ప్రస్తుత విభాగాల్లో ఎక్కువ మందికి సేవలు అందించగలిగితే. కొత్త విభాగాలకు రోగులు అధికసంఖ్యలో వస్తారన్నారు. రోగులకు సకాలంలో, నాణ్యమైన సేవలు అందించాలని సిబ్బందికి చెబుతున్నామన్నారు.