ఆంధ్రా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మళ్లీ తెరపైకి వచ్చారు. కిర్లంపూడిలోని తన ఇంట్లో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. దీనికి వైసీపీ నేతలు, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు హాజరయ్యారు. దీంతో ముద్రగడ పద్మనాభం అధికార వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అటు వైసీపీ కూడా ఆయన్ను ఆహ్వానించినట్టు తెలుస్తోంది.
ముద్రగడ పద్మనాభం కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల.. కాపు ఉద్యమ కేసుల నుంచి ముద్రగడ పద్మనాభంకు ఊరట లభించింది. ఆ తర్వాత ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. 20 రోజుల కిందట కూడా వైసీపీ కాపు నేతలతో ముద్రగడ భేటీ అయ్యారు. దీంతో ముద్రగడ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారని.. ఆయన సన్నిహితుల చెబుతున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ముద్రగడ పద్మనాభం పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. కానీ.. దానిపై ఫుల్ క్లారిటీ లేదు. వేరే నియోజకవర్గాల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.
పెద్దాపురం నియోజకవర్గం నుంచి ముద్రగడ పద్మనాభం పోటీ చేస్తారనే టాక్ ఉంది. దానికి కారణాలు కూడా చెబుతున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. కాపు ఓటర్లకు ఆకట్టుకోవడానికి.. పవన్ పోటీ చేసే పక్క నియోజకవర్గం నుంచి ముద్రగడను రంగంలోకి దింపాలని వైసీపీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 14వ తేదీ నుంచి తూర్పుగోదావరి జిల్లా పవన్ పర్యటన ఉంది. అయితే.. జనసేన నుంచి కూడా ముద్రగడ పద్మనాభంకు ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది.
ఇటు వైసీపీ, అటు జనసేన నుంచి ఆఫర్లు రావడంతో.. ముద్రగడ పద్మనాభం ఎటువైపు మొగ్గు చూపుతారనే చర్చ జరుగుతోంది. అయితే.. చాలామంది వైసీపీలోనే జాయిన్ అవ్వాలని ముద్రగడ పద్మనాభంపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే.. తుని ఘటన జరిగిన సమయంలో.. పవన్ కనీసం తమకు మద్దతు ఇవ్వలేదని.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడారని అంటున్నారు. అంతేకాకుండా.. ముద్రగడను, ఆయన కుటుంబ సభ్యులను గత ప్రభుత్వం వేధించినప్పుడు కూడా పవన్ ఎలాంటి మద్దతు ఇవ్వలేదని కాపులు ఆగ్రహంతో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది.