జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు ఏపీకి రానున్నారు. హైదరాబాద్ నుంచి మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి పవన్ కల్యాణ్ ఇవాళ చేరుకోనున్నారు. ఈ సందర్భంగా వారాహి యాత్ర ఏర్పాట్లు, పోలీసుల ఆంక్షలపై ముఖ్య నేతలతో చర్చించనున్నారు. రేపు మంగళగిరి జనసేన ఆఫీస్‌లో కొత్త భవనానికి భూమిపూజ చేయనున్నారు.
ఎల్లుండి పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ హోమం చేయనున్నారు. 14వ తేదీ నుంచి రాష్ట్రంలో పవన్ కల్యాణ్ వారాహి యాత్రను చేపట్టనున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో హోమం నిర్వహిస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ వారాహి యాత్రపై టెన్షన్ నెలకొంది. కోనసీమ జిల్లాలో సభలు, ర్యాలీలపై ఆంక్షలు విధిస్తున్నట్లు శనివారం రాత్రి పోలీసులు ప్రకటన జారీ చేశారు. కోనసీమ జిల్లాలో సెక్షన్ 30 అమలు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఆంక్షలపై జనసేన వర్గాలు మండిపడుతున్నాయి. జనసేన యాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, అందులో భాగంగానే పోలీసులు ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చారని జనసైనికులు ఆరోపిస్తున్నారు.
ఎన్ని ఆంక్షలు విధించినా వారాహి యాత్ర జరిగి తీరుతుందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. పోలీసుల తీరుపై జనసేన వర్గాలు మండిపడుతున్నాయి. పవన్ కల్యాణ్ యాత్ర సమయంలోనే శాంతి భద్రతలు గుర్తుకొస్తాయా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ సబ్ డివిజన్‌తో పాటు పెద్దాపురం, అమలాపురం పరిధిలో సెక్షన్ 30 అమలు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించడంపై జనసేన నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ ఆంక్షలపై జనసేన నేతలతో పవన్ చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
14వ తేదీ కాకినాడలో యాత్ర ప్రారంభించనుండగా.. 13న రాత్రి అన్నవరం చేరుకోనున్నారు. 14న ఉదయం సత్యదేవుడిని దర్శించుకుని వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు వారాహి యాత్ర ప్రారంభం కానుండగా.. 5 గంటలకు ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడికి చేరుకుంటారు. అక్కడి బస్డాండ్ సెంటర్‌లో తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ యాత్రలో భాగంగా వివిధ వర్గాల ప్రజలతో భేటీ కానున్నారు. ప్రతి నియోజకవర్గంలో రెండు రోజుల పాటు పవన్ యాత్ర కొనసాగేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ యాత్రతో ఏపీలో జనసేన మరింత దూకుడు పెంచనుంది.
ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రతో క్షేత్రస్థాయిలో పర్యటిస్తుండగా.. పవన్ వారాహి యాత్రలో ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. ఈ యాత్రలతో ఏపీ పాలిటిక్స్ మరింత వేడెక్కనున్నాయి. జగన్ సర్కార్ టార్గెట్‌గా యాత్రలో పవన్ తీవ్ర విమర్శలు చేేసే అవకాశముంది.