జమ్మూకశీర్లో 370 అధికరణను రద్దు చేస్తామని చెప్పినప్పుడు.. అలా చేస్తే అక్కడ రక్తం ఏరులై పారుతుందని కాంగ్రెస్ నేత ‘రాహుల్ బాబా’ వ్యాఖ్యానించారని, కానీ అక్కడ అటువంటి ఘటన ఒక్కటీ జరగలేదని అమిత్ షా చెప్పారు. శత్రుదేశాలు భారతదేశం వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయలేని విధంగా మోదీ రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేశారన్నారు. పుల్వామాలో పాక్ ప్రేరేపిత మూకలు దాడి చేసిన పది రోజుల్లోనే పాకిస్థాన్‌లోకి వెళ్లి మరీ సర్జికల్ స్ట్రైక్స్ చేశామని గుర్తుచేశారు. ప్రధాని ఏ దేశానికి వెళ్లినా.. మోదీ.. మోదీ అంటూ జనం నినదిస్తున్నారని.. అది బీజేపీకి కాదని, 130 కోట్ల భారత ప్రజలకు దక్కిన గౌరవమని వ్యాఖ్యానించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 300 స్థానాలతో అధికారంలోకి రావడం తథ్యమని అమిత్ షా ధీమా వ్యక్తంచేశారు. ఏపీలో 25 మంది పార్లమెంటు స్థానాలు ఉన్నాయని, వాటిలో 20 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తామని చేతులెత్తి శపథం చేయాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు.