ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ ప్రభుత్వం అనేకం చేసిందని అమిత్‌షా అన్నారు. రెండు వందేభారత్ రైళ్లను మంజూరు చేసిందని.. విశాఖకు ఒకటి, తిరుపతి మరొకటి నడుస్తున్నాయని చెప్పారు. విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.450 కోట్లు మంజూరు చేశామన్నారు. కడప, కర్నూలుల్లో విమానాశ్రయాల నిర్మాణానికి సహకరించామని, భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి అనుమతులు ఇచ్చామని చెప్పారు. ‘ఏపీలో జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.3 లక్షల కోట్లతో పాటు సాగరమాల కింద మరో రూ.85 వేల కోట్ల ప్రాజెక్టులు మంజూరు చేశాం. కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి, అమరావతి నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తున్నాం. విశాఖపట్నం, అనంతపురాల్లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు నిర్మిస్తున్నాం. తిరుపతిలో ఐఐటీ, విశాఖలో ఐఐఎం, మంగళగిరిలో ఎయిమ్స్, తాడేపల్లిగూడెంలో నిట్, శ్రీసిటీలో ఐఐఐటీ, విజయనగరంలో గిరిజన యూనివర్సిటీ, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుచేశాం. మరో మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చాం. కాకినాడకు బల్క్ డ్రగ్ పార్క్ మంజూరుచేశాం’ అని తెలిపారు. కరోనా సమయంలో ప్రతి ఒక్కరికీ రెండు వ్యాక్సిన్లు ఉచితంగా వేశామని, వాటికి ఒక్క రూపాయి కూడా ఎవరూ వెచ్చించలేదన్నారు.