అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపొర్‌జాయ్’ అతి తీవ్ర తుఫానుగానే కొనసాగుతోంది. ఉత్తర ఈశాన్య దిశగా తీరానికి చేరువగా కదులుతుండటంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. గాలుల ఉద్ధృతికి కొన్ని విమాన సర్వీసులను రద్దు చేయగా.. చాలా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని విమానాలకు ల్యాండింగ్‌కు పరిస్థితి అనుకూలించకపోవడంతో దారిమళ్లిస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బిపొర్‌జాయ్ తుఫాను నేపథ్యంలో కొన్ని రన్‌వేలను తాతాల్కికంగా మూసివేశారు. దీనిపై ఎయిరిండియా ట్వీట్ చేస్తూ ‘‘ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ముంబయి విమానాశ్రయంలోని 09/27 రన్‌వేను తాత్కాలికంగా మూసివేశారు.. కొన్ని విమానాలు ఆలస్యం/ రద్దయ్యాయి. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం.. అంతరాయాన్ని తగ్గించేందుకు సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని ఎయిరిండియా తెలిపింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే విమానాల రాకపోకల్లో జాప్యం జరుగుతున్నట్లు పేర్కొంది.
కాగా, గంటల తరబడి నిరీక్షిస్తోన్న ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు సరైన సౌకర్యాలు కూడా కల్పించడం లేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు, బిపొర్‌జాయ్ తుఫాను గుజరాత్ లోని కచ్, పాకిస్థాన్‌లోని కరాచీల మధ్య జూన్ 15న తీరాన్ని దాటనుందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది.
ప్రస్తుతం తూర్పు మధ్య అరేబియా తీరంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను.. గంటలకు 8 కి.మీల వేగంతో ఉత్తర ఈశాన్య దిశగా కదులుతున్నట్లు ఐఎండీ తెలిపింది. ఈ నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని అధికారులతో ముఖ్యమంత్రి భూపీంద్ర పటేల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్, డీజీపీ వికాస్ సాహయ్, రిలీఫ్ కమిషనర్ అలోక్ పాండేతో పాటు రెవెన్యూ, విద్యుత్, రోడ్లు రహదారుల విభాగం అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
తుపాను తీరం దాటే సమయంలో గంటకు 135-150 కి.మీల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో కచ్, సౌరాష్ట్రలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తీరంలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో జూన్ 15 వరకు అరేబియా సముద్రంలోకి వెళ్లొద్దని మత్స్యకారులను అధికారులు హెచ్చరించారు.