ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఈనెల 14వ తేదీన జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ప్రారంభిస్తున్న వారాహి యాత్రను విజయవంతం చేయాలని జనసేన పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని వెంకటాపురం పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, జనసేన అధికార ప్రతినిధి సుందరపు విజయ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయశేఖర్ విలేకర్లతో మాట్లాడారు. ఈనెల 14వ తేదీన అన్నవరం నుంచి పవన్‌కల్యాణ్ వారాహియాత్రను ప్రారంభిస్తున్నారన్నారు. తొలుత అన్నవరంలో స్వామివారి సన్నిధిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి, యాత్ర ప్రారంభమవుతుందన్నారు. అనంతరం కత్తిపూడిలో సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనను ఈ బహిరంగ సభలో ఎండగట్టడం జరుగుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి, రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నంను పుట్టినిల్లుగా చేసుకొని మాదకద్రవ్యాల కేంద్రంగా మార్చేసిందని వారు ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిం చకుండా నిరుద్యోగులను దగా చేశాడన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తన పేరు పెట్టుకొని జగన్ ప్రచారం చేసుకుంటున్నాడన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్లను పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిదన్నారు. ప్రజాసంక్షేమానికి అలుపెరగని పోరాటం చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ను ప్రజలు మరింతగా ఆదరించాలని వారు కోరారు. విలేకర్ల సమావేశంలో పార్టీ నేతలు బైలపూడి రామదాసు, జనపరెడ్డి శ్రీనివాసరావు, పప్పల నూకన్నదొర పాల్గొన్నారు.