ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గంలో కోట్లు కుమ్మరించినా, కత్తులతో బెదిరించినా టీడీపీదే విజయమని ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి వరుపుల సత్యప్రభ పేర్కొన్నారు. పోమవారం సాయంత్రం అన్నవరం ప్రైవేట్ రిసార్ట్సులో నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. తన భర్త రాజా నియోజకవర్గ ప్రజలకు చేపట్టిన సేవాకార్యక్రమాలను ప్రజల్లోకి మరింత తీసుకెళతానన్నారు. ముందుగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ... ప్రత్తిపాడు నియోజకవర్గంలో వరుపుల సత్యప్రభకే పార్టీ మద్దతు ఉంటుందని, గ్రూపులు కట్టి పార్టీకి నష్టం చేకూర్చేవారని సహించేది లేదన్నారు. ఏ సమస్య ఉన్నా వరుపుల రాజాకే అప్పగించేవారమని, దాన్ని ఆయన సమర్థవంతంగా నిర్వహించేవారన్నారు. ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ సమావేశానికి విచ్చేసిన జనాన్ని చూస్తే సత్యప్రభ విజయోత్సవ సభలా ఉందన్నారు. టీడీపీ ఇజల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ మాట్లాడుతూ వరుపుల రాజాలేని లోటు ఎవరూ పూడ్చలేనిదని, సత్యప్రభ విజయం నల్లేరుమీద నడకేనన్నారు. టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ అధికారంలోకి రాగానే ఒక్క కలంపోటుతో కార్యకర్తలపై అక్రమంగా బనాయించిన కేసులను మాఫీచేస్తామన్నారు. యనమల కృష్ణుడు మాట్లాడుతూ తనకు ఇద్దరు కూతుళ్ల ని, తునిలో దివ్య, ప్రత్తిపాడులో సత్యప్రభను గెలిపించే బాధ్యతను తీసుకుంటానని అన్నారు. నాయకులు ముదునూరి మురళీకృష్ణంరాజు కూడా మాట్లాడారు. పర్వత సురేష్, వెన్నా ఈశ్వరుడు, మెరపల నరసయ్య, సరమర్ల మధుబాబులు పాల్గొన్నారు.