ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 2023 సంవత్సరంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 1,250 మంది విద్యార్థులకు, ఇంటర్మీడియట్‌లో నాలుగు గ్రూపుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థుల్లో గ్రూపునకు ఒకరు చొప్పున 1,585 మందిని ‘జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమం కింద ప్రతిభ అవార్డులతో సత్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం స్థాయిల్లో విడివిడిగా జరిగే ఈ కార్యక్రమాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతితో పాటు మెరిట్ సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేస్తారు. విద్యార్థులు తల్లిదండ్రులను శాలువాలతో, ఆ పాఠశాలల హెడ్‌మాస్టర్లను శాలువ, మొమెంటోతో సత్కరిస్తారు. రాష్ట్ర స్థాయిలో ఈ నెల 20న ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా పదో తరగతిలో రాష్ట్ర స్థాయిలో మొదటి మూడు స్థానాలు సాధించిన విద్యార్ధులను, ఇంటర్మీడియట్‌లో నాలుగు గ్రూపుల్లో అత్యధిక మార్కులు సాధించిన నలుగురిని సత్కరించనున్నారు.