రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంపై ఇద్దరు బీజేపీ అగ్ర నేతలు చౌకబారు ఆరోపణలు చేశారని ఏపీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. విశాఖపట్నంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, శ్రీకాళహస్తిలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని ఆయన అన్నారు. ఈ మేరకు మంగళవారం కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు దేశం పార్టీ కోవర్టులైన బీజేపీ నాయకులను పక్కన పెట్టుకుని అమిత్ షా, జేపీ నడ్డా మాట్లాడారని ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలు చూశాక.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాల మధ్య విభేదాలు వచ్చినట్లు అనుమానాలు కలుగుతున్నాయని కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నోటి వెంట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా రాలేదన్నారు. గతంలో చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్తే ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వని దాఖలాలు ఉన్నాయని గుర్తు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఒకవేళ బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్టులు చెప్పిన మాటలు నమ్మితే పోలవరం ప్రాజెక్టుకు రూ. 13 వేల కోట్లు, రెవెన్యూ లోటు కింద రూ.10 వేల కోట్లు వస్తాయా అని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. సీఎం జగన్‌పై ఉన్న ప్రత్యేకమైన అభిమానంతోనే ఆ డబ్బులు ప్రధాని మోదీ విడుదల చేశారని పేర్కొన్నారు. గతంలో పోలవరం నిధులు ఏటీఎం కింద వాడేస్తున్నారని స్వయంగా ప్రధాని మోదీ విమర్శలు చేశారని గుర్తు చేశారు. తనకు ఉన్న అవగాహన మేరకు అమిత్ షా, మోదీల మధ్య విభేదాలు వచ్చాయని అనుకుంటున్నట్లు చెప్పారు.
ప్రధాని మోదీకి సీఎం జగన్‌పై విశ్వాసం ఉండబట్టే నిధులు వచ్చాయని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. మహాజన సభలో బీజేపీ నేతలు ప్రధాని మోదీని పొగడాల్సింది పోయి.. సీఎం జగన్మోహన్ రెడ్డిని తిట్టారని చెప్పారు. ఇలా తిడితే ఆంధ్రులు మెచ్చుకుంటారా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖపట్నం ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల లాంటి నిర్ణయాలు తీసుకుంటే ఆంధ్రులు సంతోషిస్తారని హితవు పలికారు. బీజేపీ, టీడీపీ కలిస్తే జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిన చందంగా ఉంటుందని కొట్టు సత్యనారాయణ విమర్శించారు.