కొన్ని అరుదైన సన్నివేశాలు అపుడపుడు మనకు దర్శనమిస్తుంటాయి. ఆకారంలోనే కాదు, బలంలోనూ ఏనుగును మించినది లేదు. అడవిలో ఏ జంతువు అయినా దీని ముందు తలవంచాల్సిందే. ఖడ్గ మృగం కూడా తక్కువదేమీ కాదు. అయినా ఏనుగు ముందు తలదించుకోవాల్సిందే. కానీ, ఓ ఖడ్గ మృగం మాత్రం తగ్గేదేలే.. అంటూ ఏనుగు మీదకు ఒంటి కాలితో లేచింది. ఇంకే ముంది.. రెండింటి మధ్య భీకరపోరు. ఎంతో సేపు సాగలేదు లేండి. ఏనుగు నిమిషంలోపే మ్యాటర్ ముగించేసింది. తన తొండంతో ఖడ్గమృగాన్ని మట్టి కరిపించింది.
ఏనుగు దెబ్బకు బిత్తరపోయిన ఖడ్గ మృగం బతికితే అదే చాలులే అనుకుంటూ ఏనుగు తొండం నుంచి తప్పించుకుని పరుగు పెట్టింది. ఈ దాడిలో దానికి గాయం కూడా అయింది. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నందా ఈ వీడియోని తన ట్విట్టర్ లో ఇటీవలే షేర్ చేశారు. బలవంతుల మధ్య సమరం అంటూ ఆయన క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో ఎక్కడ తీసిందన్న వివరాలు లేవు. నిజానికి ఈ రెండూ అడవిలో భయంకరమైన జీవులు. ఖడ్గ మృగాలు సహజంగానే బెదిరింపులకు దిగుతాయని, ఏనుగులు మాత్రం తమకు ముప్పు అనిపించేంత వరకు స్పందించవని ఓ యూజర్ కామెంట్ చేశాడు. దీనికి నెటిజన్లు హుషారుగా స్పందిస్తున్నారు.