దురాక్రమణకు పాల్పడే చైనాను కట్టడిచేసేందుకు భారత్ నడుంబిగిస్తోంది. చైనా భూభాగంలోని ప్రతీ ప్రాంతాన్ని చేరుకోగల అణు వార్ హెడ్లను భారత్ సమకూర్చుకుంటోందని స్వీడన్ కు చెందిన సంస్థ సిప్రి (స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) తన నివేదికలో వెల్లడించింది. చైనాలోని అన్ని ప్రాంతాలకు చేరుకోగల ఆయుధాలపై ప్రయోగాలు చేస్తోందని తెలిపింది. చైనా, పాకిస్థాన్ నుంచి ముప్పు పొంచి ఉండటంతో భారత్ అణ్వాయుధ సామర్థ్యంపై దృష్టి సారించిందని, భారీ ఆయుధాలను తయారు చేయాలని నిర్ణయించుకుందని పేర్కొంది. ఇండియా మెయిన్ టార్గెట్ పాకిస్థాన్ అయినప్పటికీ.. చైనా నుంచి ముప్పు ఉండే అవకాశం ఉండటంతో లాంగ్ రేంజ్ వెపన్స్ పై దృష్టి పెట్టిందని తెలిపింది.
ఉక్రెయిన్ పై రష్యా దాడి చేయడం అణు నిరాయుధీకరణపై పెద్దదెబ్బ కొట్టిందని తెలిపింది. 2022 జనవరిలో చైనా వద్ద 350 వార్ హెడ్స్ ఉండేవని... 2023 జనవరి నాటికి వాటి సంఖ్యను 410కి పెంచుకుందని చెప్పింది. వార్ హెడ్లను పెంచుకునే కార్యక్రమాన్ని చైనా ఇంకా కొనసాగిస్తోందని భావిస్తున్నట్టు తెలిపింది. ఇండియా వద్ద ప్రస్తుతం 164 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉండొచ్చని అభిప్రాయపడింది.