ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలు జిల్లాలో వైసీపీలో గ్రూపు రాజకీయాలు భగ్గుమంటున్నాయి. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న... మంత్రి ఉషశ్రీ చరణ్ కు అసమ్మతి సెగ తగిలింది. సొంత పార్టీలో వ్యతిరేక వర్గీయులు సమావేశమయ్యారు. మంత్రి పని తీరును నిరసిస్తూ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి ఇంట్లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశమైనట్టు సమాచారం.
ఈ సమావేశంలో మండలస్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీలో తమను అవమానిస్తున్నారని, ఏ కార్యక్రమానికీ తమను ఆహ్వానించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉషశ్రీ చరణ్ టీడీపీ నుండి వచ్చారని, అందుకే వైసీపీ కేడర్ ను నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తొలుత ఈ సమావేశాన్ని ఓ రైతు వ్యవసాయ క్షేత్రంలో పెట్టాలని భావించారు. కానీ ఆ తర్వాత ఆయన అనుమతిచ్చేందుకు నిరాకరించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో తిప్పేస్వామి నివాసంలో ఈ భేటీ జరిగినట్లుగా తెలుస్తోంది.