తమిళనాడులో అధికార డీఎంకే పార్టీని ఢీకొట్టేందుకు అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. అయితే ఆ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. బీజేపీ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలతో తీవ్ర విసుగు చెంది ఉన్న అన్నాడీఎంకేకు.. తాజాగా బీజేపీ అధ్యక్షుడు అన్నామలై చేసిన వ్యాఖ్యలు మరింత అగ్గి రాజేశాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకేను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన జయలలిత విషయంలో.. ఇటీవల ఓ ఇంగ్లీష్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీ చీఫ్ అన్నామలై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత దోషిగా తేలిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అన్నా డీఎంకే.. బీజేపీ అధిష్ఠానానికి అల్టిమేటం జారీ చేసింది.
ఓ టీవీ ఇంటర్వ్యూలో భాగంగా తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై మాట్లాడారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత దోషిగా తేలారని అన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు జయలలిత అని.. అయితే సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించే నాటికి.. ఆమె మరణించారని పేర్కొన్నారు. ఇదే కేసులో సహ నిందితులుగా ఉన్న జయలలిత నెచ్చెలి వీకే శశికళతోపాటు మరికొంత మందిని.. సుప్రీంకోర్టు దోషులుగా తేల్చిందని వెల్లడించారు. అంతకుముందు ఇదే కేసులో జయలలితకు ఊరటను ఇస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ విషయాలను టీవీ ఇంటర్వ్యూలో అన్నామలై ప్రస్తావించడం తాజా రగడకు కారణమైంది.
జయలలితపై అన్నామలై చేసిన వ్యాఖ్యలను అన్నాడీఎంకే నేతలు తీవ్రంగా ఖండించారు. అన్నామలైపై చర్యలు తీసుకోవాలని బీజేపీ అధిష్ఠానానికి అల్టిమేటం జారీ చేశారు. లేని పక్షంలో తాము కూటమిపై పునరాలోచిస్తామని.. అన్నాడీఎంకే నేతలు స్పష్టం చేశారు. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా ఉండే అర్హత అన్నామలైకి లేదని పేర్కొన్నారు. తాను అన్న పదాలను అన్నామలై గుర్తుకు చేసుకోవాలని సూచించారు. ఇదే సమయంలో తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకే పొత్తు.. అన్నామలైకి ఇష్టం లేదా అని ప్రశ్నించారు. లేక ప్రధానిగా నరేంద్ర మోదీ మరోసారి గెలవాలని కోరుకోవడం లేదా అని నిలదీశారు.
తమిళనాడులో 2024 ఎన్నికలకు అన్నాడీఎంకేతో పొత్తు విషయంలో గత మార్చిలో అన్నామలై వ్యతిరేకంగా మాట్లాడారని అన్నాడీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నప్పటికీ.. ద్రవిడ రాజకీయాల్లో ఉత్తరాది పార్టీలను కలుపుకోవడం ఇష్టం లేక జయలలిత.. కాషాయ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. అయితే జయలలిత మృతి తర్వాత.. అన్నాడీఎంకేలోని సీనియర్ నేతలు.. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. గతంలో తమిళనాడులో పోటీలో లేని బీజేపీ.. అన్నాడీఎంకేలోని పన్నీర్ సెల్వం, పళని స్వామి వర్గాల మధ్య అంతర్గత పోరుతో.. ప్రతిపక్ష హోదా కోసం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే అన్నాడీఎంకే పార్టీతో పొత్తుకు అంగీకరించింది. ఇప్పుడు కొంత బీజేపీకి బలం పెరగడంతో అన్నాడీఎంకేను పక్కకు నెట్టి తామే.. డీఎంకే సర్కారుకు ప్రత్యామ్నాయమని చూపించేందుకు ప్రయత్నిస్తోంది.
తమిళనాడులో బీజేపీ - అన్నాడీఎంకే కూటమి వరుస పరాజయాలను ఎదుర్కొంది. లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు సహా బీజేపీతో కలిసి రంగంలోకి దిగిన నాలుగు ఎన్నికల్లో అన్నాడీఎంకే వరుసగా ఓటమి పాలైంది. దీంతో ఇరు పార్టీలు కలిసి పోటీ చేస్తే గెలుపు దక్కడం లేదని భావించి ఇటీవల జరిగిన ఈరోడ్ ఈస్ట్ ఉపఎన్నికకు ముందు ప్రచారంలో రెండు పార్టీలు వేర్వేరుగానే ప్రచారం చేపట్టాయి. అయితే ఇక్కడ ఉన్న సిట్టింగ్ స్థానాన్ని అన్నాడీఎంకే కోల్పోయింది.
అయితే తమిళనాడులో ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. పార్టీ అంతర్గత సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో 25 స్థానాల్లో విజయం సాధించాలని లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే తమిళనాడులో ఉన్న 39 లోక్‌సభ స్థానాల్లో 25 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తే.. తమకు కేవలం 14 స్థానాలు మాత్రమే మిగులుతాయని అన్నాడీఎంకే వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీతో తెగదెంపులు చేసుకునేందుకు సిద్దమైనట్లు సమాచారం.
గతంలో రైల్వే శాఖ మంత్రులుగా పని చేసిన మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్ యాదవ్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పరోక్ష విమర్శలు చేశారు. ఉద్యోగాలకు డబ్బులు తీసుకున్నారని, రేటు కట్టి అమ్ముకున్నారని ఆరోపించారు. కానీ తమ ప్రభుత్వం యువత భవిష్యత్తును కాపాడేందుకు కృషి చేస్తోందని చెప్పారు.