రిక్టర్ స్కేలుపై 5.4 తీవ్రతతో సంభవించిన భూకంపం.. ఉత్తర భారతదేశాన్ని భయాందోళనలకు గురి చేసింది. మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు సంభవించిన భూకంపం ధాటికి.. భూమి పలు సెకన్ల పాటు కంపించింది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు.
భూకంప కేంద్రం
జమ్ము కశ్మీర్‌లోని దోడా జిల్లాలో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ట్వీట్ చేసింది. 13 - 06 - 2023.. మంగళవారం.. మధ్యాహ్నం 1.33 గంటలకు రిక్టర్ స్కేలుపై 5.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని ట్విటర్‌లో వెల్లడించింది. దోడా జిల్లాలో 6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కనుక్కున్నట్లు పేర్కొంది. ఈ భూకంపం ధాటికి పాకిస్థాన్‌లోని లాహోర్‌లో కూడా భూ ప్రకంపనలు వచ్చినట్లు తెలిపింది.
ఏ ఏ రాష్ట్రాల్లో
ఉత్తర భారత దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భూ కంపం సంభవించినట్లు భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది. ఢిల్లీ, జమ్ము కశ్మీర్, పంజాబ్, చంఢీగఢ్ రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వచ్చిటన్లు తెలిపింది. భూకంపం వచ్చినప్పుడు తీసిన వీడియోలను కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇటీవల కొన్నిసార్లు భూమి కంపించిన ఘటనలను గుర్తు చేస్తూ మీమ్స్ షేర్ చేశారు. మరికొంతమంది భూకంపం ధాటికి కదులుతున్న సీలింగ్ ఫ్యాన్లు, ఇతర వస్తువులకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేశారు. గత నెల దేశ రాజధాని ఢిల్లీలో స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. అఫ్గానిస్థాన్‌లో 5.2 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా అప్పుడు ఢిల్లీలో భూమి కంపించిందని అధికారులు పేర్కొన్నారు.