విమనా ప్రయాణికుల్లో ఉన్న ప్రియురాలిని కాక్‌పిట్‌లో కూర్చోబెట్టుకున్న పైలట్‌పై ఎయిరిండియా గత నెల చర్యలు తీసుకుంది. తాజాగా, ఢిల్లీ-లేహ్ విమానంలో గతవారం ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ మహిళను పైలట్, కో-పైలట్ కాక్‌పీట్‌లోకి ఆహ్వానించడంతో ఎయిరిండియా వారిపై చర్యలకు ఉపక్రమించింది. ఏI-445 ఢిల్లీ-లేహ్ విమానం కాక్‌పిట్‌లోకి అనధికారిక మహిళ ప్రయాణీకురాలు ప్రవేశించినట్టు క్యాబిన్ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో యాజమాన్యం సీరియస్‌గా స్పందించింది. ఇరువుర్నీ విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
‘నిబంధనలు ఉల్లంఘించిన ఏI-445 విమానం కాక్‌పీట్‌లోకి పైలట్ గర్ల్‌ఫ్రెండ్ ప్రవేశించింది.. విమానం నడిపిన ఇద్దరు పైలట్లను ఎయిరిండియా విధుల నుంచి తప్పించింది’ అని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పందిస్తూ.. ‘ఈ విషయం మా దృష్టికి వచ్చింది.. నిబంధనలు ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటాం.. సమగ్ర దర్యాప్తునకు ఎయిరిండియా ఓ కమిటీని వేసింది’ అని పేర్కొంది. అయితే, దీనిపై ఎయిరిండియా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.
అయితే, విచారణకు ఓ కమిటీ వేసినట్టు ఎయిరిండియా అధికారి ఒకరు వెల్లడించారు. లేహ్ మార్గం భద్రత పరంగా దేశంలో అత్యంత కష్టతరమైన, సున్నితమైన విమాన మార్గాలలో ఒకటి. వాణిజ్య విమానంలో అనధికార వ్యక్తిని కాక్‌పిట్‌లో అనుమతించడం చట్టాన్ని ఉల్లంఘించినట్లే.
‘లెహ్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అనేది ఎత్తైన పర్వత భూభాగం.. దేశంలోని సైనిక దళాల స్థావరాలు ఉండటం.. చాలా సున్నితంగా ఉండటం వల్ల దేశవ్యాప్తంగా అత్యంత కష్టతరమైన కార్యకలాపాలలో ఒకటి. అంతేకాకుండా, ఈ భూభాగంలో తగినంతగా ఆక్సిజన్ లేకపోవడం వల్ల మంచి ఆరోగ్య రికార్డు అవసరం.. ఈ నేపథ్యంలో ఎటువంటి అనారోగ్ సమస్యలు లేని, అత్యంత నైపుణ్యం కలిగిన పైలట్‌లను మాత్రమే లేహ్ కార్యకలాపాలకు వినియోగించాలి’ అని వైమానిక రంగ నిపుణుడు విపుల్ సక్సేనా అన్నారు.
ఫిబ్రవరి 27న దుబాయ్-ఢిల్లీ విమానంలో పైలట్ తన గర్ల్ ఫ్రెండ్‌ను కాక్‌పీట్‌లోకి ఆహ్వానించి.. తన పక్కనే కూర్చొబెట్టుకున్న ఘటన తీవ్ర కలకలం రేగింది. దీంతో అతడి లైసెన్స్‌ను ఇటీవల ఎయిరిండియా రద్దు చేసింది. అంతేకాదు, నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా విధించింది.