పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడానికి కాంట్రాక్టర్ నుంచి రూ.26 వేలు లంచం తీసుకుంటూ ఇద్దరు విశాఖపట్నం నేవీ అధికారులు సీబీఐకి పట్టుబడ్డారు. లంచం ఇచ్చిన కాంట్రాక్టర్‌తోపాటు ఆయన ప్రతినిధిని కూడా అరెస్టు చేసినట్టు సీబీఐ అధికారులు మంగళవారం ప్రకటించారు. భానుప్రతాప్ యాదవ్ అనే కాంట్రాక్టర్ కొన్నాళ్ల కిందట నేవీలోని పనులు చేశారు. ఆయనకు రూ.26 లక్షల బిల్లులు ఇంకా రావాల్సి ఉంది. ఆ బిల్లులను చెల్లించేందుకు రూ.26 వేలు లంచం ఇవ్వాలని సీడీఏలో సీనియర్ ఆడిటర్ తెలికిచెర్ల రమణకుమార్, డేటా ఎంట్రీ ఆపరేటర్ భీశెట్టి డీడీ నూకేశ్వరరావు డిమాండ్ చేశారు. దీనిపై సీబీఐ అధికారులకు సమాచారం అందడంతో నిఘా పెట్టారు. కాంట్రాక్టర్ భానుప్రతా్‌పకు రోడ్డు ప్రమాదం జరగడంతో లంచం సొమ్మును తన ప్రతినిధి సుభాశిష్ మిశ్రా ద్వారా పంపిస్తున్నట్టు సమాచారం అందించారు. సోమవారం ఉదయం సుభాశిష్ మిశ్రా లంచం సొమ్ముని నూకేశ్వరరావు, రమణకుమార్‌కు అందజేస్తుండగా సీబీఐ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి, ఉద్యోగుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు.