అనకాపల్లి సమీపంలోని ప్రముఖ బౌద్ధక్షేత్రం బొజ్జన్నకొండ అభివృద్ధి కాకపోవడానికి ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతి వైఫల్యమే కారణమని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆరోపించారు. మంగళవారం బొజ్జన్నకొండ వద్ద వైసీపీ ప్రభుత్వానికి సెల్ఫీ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ హయాంలో బొజ్జన్నకొండ అభివృద్ధికి రూ.7 కోట్లు మంజూరయ్యాయని, పనులు ప్రారంభించే సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో కార్యరూపం దాల్చలేదన్నారు. ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతి నాలుగేళ్ల నుంచి ప్రకటనలకే పరిమితమయ్యారు తప్ప బొజ్జన్నకొండ అభివృద్ధి విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శిచారు. టీడీపీ హయాంలో నిర్మించిన వాటికి వైసీపీ రంగులు వేసుకోవడం తప్ప ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదన్నారు. మంత్రి అమర్నాథ్కు గాల్లో మేడలు కట్టడం, ప్రచార పిచ్చి తప్ప అభివృద్ధి అంటే అర్థం తెలియదని విమర్శించారు. బొజ్జన్నకొండను అభివృద్ధి చేయడం చేతకాకపోతే మంత్రి, ఎంపీ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.