యన్ఐఏ కోర్టులో నేడు కోడి కత్తి కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టుకు కోడి కత్తి శ్రీను, ఇరు పక్షాల న్యాయవాదులు హాజరయ్యారు. అయితే ఈ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. తనకు జైలు నుంచి విముక్తి కలిగించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కోడికత్తి కేసులో నిందితుడు జన్నుపల్లి శ్రీనివాస్ లేఖ రాశాడు. శ్రీను లేఖలో ఏం రాశాడంటే.. ‘‘1610 రోజులుగా బెయిల్ లేకుండా జైలులోనే ఉంటున్నా. నేను ఇంకా ఎంత కాలం జైలులో ఉండాలో తెలియడం లేదు. విముక్తి కలిగించండి. నాపై నమోదు అయిన కేసును జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ విచారించి న్యాయం చేయాలి. నాకు న్యాయం చేయాలని అనేక మార్లు కోర్ట కు విన్నవించా. అయినా స్పందన లేకపోవడంతో మీకు (సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి) లేఖ రాస్తున్నా’’ అని పేర్కొన్నాడు. ఇక లేఖ విషయమై శ్రీను తరుఫు న్యాయవాది అబ్దుస్ సలీం మాట్లాడుతూ.. తెలుగులో రాసిన శ్రీను లేఖను ఇంగ్లీషులోకి అనువాదం చేసి పంపిస్తున్నాం. అతని తల్లి సావిత్రి ఇంతకముందు ఆ సమయంలో సీజేఐగా ఉన్న ఎన్వీ రమణ కు ఇదే విషయంపై లేఖ రాశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ కోర్టు కు పది కిలో మీటర్ల దూరంలో నివాసం ఉన్నారు. పదిహేను నిమిషాలు కేటాయిస్తే సాక్ష్యం చెప్పి వెళ్లవచ్చు. ఉద్దేశపూర్వకంగా ఆయన తన న్యాయవాదులతో పిటీషన్లు వేయించారు. ఎటువంటి కుట్ర కోణం లేదని ఎన్ఐఏ అధికారులు స్పష్టం చేశారు. అయినా కొత్తగా పిటిషన్ వేయడం వెనుక వేరే కారణాలు ఉన్నాయి. ఇక ప్రతి రోజూ విచారణ వేగవంతం చేసి కేసు ముగింపు పలకాలి. కాదంటే సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయం కోరతాం’’ అని తెలిపారు.