విజయవాడ నగరంలోని పెరిగిన విద్యుత్ చార్జీలను నిరసిస్తూ ఏర్పాటు చేసిన ఆల్‌పార్టీ మీటింగ్‌లో వైసీపీ నేతలు కరెంట్ తీసేశారని టీడీపీ నేత బోండా ఉమా విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పెంచిన విద్యుత్ ఛార్జీలు, ట్రూ అప్ చార్జీలు, స్మార్ట్ మీటర్లు ఏర్పాటులను వ్యతిరేకిస్తూ ఆల్ పార్టీ లీడర్స్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని... అయితే సమావేశం ప్రారంభం అవ్వగానే ట్రాన్స్ఫార్మర్ పేలిపోయి కరెంటు పోయిందని అన్నారు. ఇది వైసీపీ నేతల పనేనని తమకు తెలుసన్నారు. మీటింగ్ నిర్వహించుకుంటున్నామని తెలిసి కరెంటు తీసేశారని.. కిందకి దిగేలోపు కారులో గాలి తీసేసిన ఆశ్చర్యపోక్కర్లేదని వ్యాఖ్యలు చేశారు. కరెంటు బిల్లుల పేరుతో ప్రజలపై పెను భారాన్ని విధిస్తున్నారని మండిపడ్డారు. కరెంటు బిల్లులతో పాటు ట్రూఆప్ చార్జీలు విధించడం ఈ ప్రభుత్వం దుర్మార్గపు చర్య అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసి కరెంటు బిల్లు మరింత ఎక్కువ వచ్చేలాగా దుర్మార్గ చర్యకు పాల్పడుతోందన్నారు. ట్రూ ఆఫ్ చార్జీలు రద్దు చేసి, స్మార్ట్ మీటర్లను పెట్టకుండా అడ్డుపడేలాగా చర్యలు తీసుకునేందుకు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని బోండా ఉమా పేర్కొన్నారు.