భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో త్వరలో అధికారిక వెబ్సైట్ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ కొద్దిరోజులుగా సాగుతోంది. దేవాదాయ శాఖకు చెందిన నిపుణుల పర్యవేక్షణలో ఇప్పటికే దేవస్థానం సమాచారాన్ని సిద్ధం చేశారు. ఇప్పటి వరకు శ్రీరామనవమి, ముక్కోటి ఏకాదశి ఉత్సవాల తరుణంలో మాత్రమే తాత్కాలికంగా వెబ్ సైట్ పనిచేస్తుంది. ఇకనుంచి నిత్యం ఆన్లైన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈఓ రమాదేవి చొరవ తీసుకుని కంప్యూటర్లు, ప్రింటర్లను తీసుకొచ్చారు. ఇందులో ఆలయ సమాచారం, పూజలు, ప్రసాదాల రుసుములను అప్ లోడ్ చేస్తున్నారు. వసతి విభాగం వివరాలను పొందుపర్చాల్సి ఉంది. ఈ నెలాఖరుకల్లా భద్రాచలం దేవస్థానానికి ప్రత్యేక వెబ్సైట్ అందుబాటులోకి రానుందని కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడి కార్యాలయంలో సిబ్బంది కొరత ఉన్నందున మిగతా ఆలయాల నుంచి సర్దుబాటు చేయాలనే ప్రతిపాదనలు దేవాదాయ శాఖ కమిషనరుకు చేరాయి.