యానాది యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగుతోంది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు నీరాజనాల నడుమ 129వరోజు పాదయాత్ర కుల్లూరు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. పాదయాత్ర ప్రారంభానికి ముందు యానాది సామాజికవర్గీయులతో సమావేశమై వారి సాధక బాధకాలు తెలుసుకున్నారు. ముస్లింలు, ఎస్సీ, ఎస్టీలు, వివిధ గ్రామాల ప్రజలు యువనేత లోకేశ్ ను కలిసి సమస్యలను విన్నవించారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అటవీ భూములు డీనోటిఫై చేసి యానాదులకు కేటాయిస్తాం, యానాదుల వ్యవసాయ భూముల్లో బోర్లు వేసి సోలార్ మోటార్లు ఏర్పాటు చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. వెంకటగిరి నియోజకవర్గం కుల్లూరు క్యాంప్ సైట్ లో యానాది సామాజికవర్గీయులతో లోకేశ్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... యానాదులు కూడా జగన్ బాధితులేనని వెల్లడించారు.
"ఒక్క ఛాన్స్ అన్న జగన్ అందరినీ ముంచేశాడు, యానాదులు కష్ట జీవులు. కష్టాన్ని నమ్ముకున్నవారు. మత్స్యకారులుగా, కూలీలుగా, కౌలు రైతులుగా జీవనం సాగిస్తున్నారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తాండాలను అభివృద్ది చేశాను. తాండాల్లో మౌలిక వసతులు, రోడ్లు, త్రాగునీరు సౌకర్యం కల్పించాను. ఐటీడీఏలు ఏర్పాటు చేసిన ఘనత టీడీపీకే దక్కుతుంది.
500 జనాభా ఉన్న తాండాలను పంచాయతీలుగా గుర్తించింది నాటి టీడీపీ ప్రభుత్వం. ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. ఎస్టీలకు వ్యవసాయ భూములు కేటాయించాం. పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే యానాదులకు పక్కా ఇళ్లు కట్టిస్తాం.