యూట్యూబ్కు పోటీ ఇచ్చేందుకు రంగంలోకి ట్విట్టర్ దిగబోతోంది. వీడియో పబ్లిషింగ్ సైట్ గా యూట్యూబ్ ఎదురులేని ప్రస్థానం కొనసాగిస్తోంది. 18 ఏళ్ల కిందట రంగప్రవేశం చేసిన యూట్యూబ్ ఇటు వీక్షకులకు విజ్ఞానం, వినోదం అందిస్తూ, అటు కంటెంట్ మేకర్స్ కు ఆదాయం అందిస్తూ అన్ని వర్గాలకు తగిన వీడియో వేదికగా నిలుస్తోంది. అంతేకాదు, యూట్యూబ్ యాప్ గా మారి స్మార్ట్ ఫోన్లలో, స్మార్ట్ టీవీల్లోనూ సందడి చేస్తోంది.
ఇదే తరహాలో ఇప్పుడు ట్విట్టర్ కూడా వీడియో యాప్ తీసుకువస్తోంది. ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ దీనిపై ప్రకటన కూడా చేశారు. స్మార్ట్ టీవీల కోసం ట్విట్టర్ వీడియో యాప్ కు రూపకల్పన చేస్తున్నట్టు వెల్లడించారు.
ఎక్కువ లెంగ్త్ ఉన్న వీడియోలను ఫోన్లలో చూడడం కష్టమవుతుంది కనుక, ఈ యాప్ ద్వారా స్మార్ట్ టీవీల్లో పెద్ద వీడియోలను సులువుగా వీక్షించవచ్చు. ట్విట్టర్ లో ప్రస్తుతం 2 గంటల నిడివి ఉన్న వీడియోలను పోస్టు చేయవచ్చు. ఈ సౌకర్యాన్ని గత నెలలోనే అందుబాటులోకి తీసుకువచ్చారు.