చాతుర్మాస్య దీక్ష కోసం రిషికేష్ పయనమ వుతున్న విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి సింహాచలం పుణ్యక్షేత్రాన్ని మంగళవారం సందర్శించారు. అప్పన్నను దర్శించుకుని ఆశీస్సులు అందు కున్నారు దేవస్థానం అధికారులు స్వరూపానందేంద్ర స్వామికి సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. ఈఓ భ్రమరాంబ, పండితులు, అర్చకులు స్వరూపానందేంద్రకు ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి చాతుర్మాస్య దీక్ష ఆహ్వాన పత్రాలను అప్పన్న విగ్రహం వద్ద ఉంచారు. దీక్ష కోసం రేపు(21వ తేదీన) రిషికేష్ బయలుదేరుతున్నారు. జూలై 3వ తేదీన ప్రారంభమయ్యే చాతుర్మాస్య దీక్ష సెప్టెంబరు 29వ తేదీ వరకు కొనసాగుతుందని స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు.
చాతుర్మాస్య దీక్షకు బయలుదేరే ముందు తమ పీఠం ఆరాధ్య దైవంగా ఉన్న లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం కోసం సింహాచలం రావడం ఆనవాయితీ అని వివరించారు. చాతుర్మాస్య దీక్ష నిర్విఘ్నంగా కొనసాగాలని అప్పన్నను ప్రార్ధించామని తెలిపారు. దీక్షా కాలంలో లోక కళ్యాణార్ధం తపస్సు చేస్తామని అన్నారు. శంకరాచార్య విరచిత గ్రంధాలను వేద విద్యార్థులకు బోధిస్తామని పేర్కొన్నారు. శంకర భాష్యంపై అధ్యయనం జరుగుతుందని, రుషులు, సాధువుల సాంగత్యంతో చాతుర్మాస్య దీక్ష కొనసాగుతుందని తెలిపారు. పవిత్ర గంగమ్మకు నిత్యం పూజలు చేస్తామని, రాజశ్యామల ఆరాధన ఉంటుందని, సాధువులకు అన్నదానం, వస్త్రదానం చేస్తామని వివరించారు.