మనం రోడ్డుపై వాహనంలో వెళ్తుంటే ఏదైనా పక్షి గానీ, జంతువు గానీ అడ్డువస్తే వెంటనే ఆపేస్తాం. ఇంకా ఎక్కువ స్పీడులో ఉంటే కింద పడిపోతాం. అది ఒక ప్రమాదం. కానీ ఇక్కడ ఏకంగా ఓ పక్షి.. విమానంలోకి దూసుకొచ్చింది. వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానాన్ని ఢీకొట్టింది. దీంతో విమానం విండ్ షీల్డ్ దెబ్బతిని అందులో ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో పైలట్ కూడా గాయపడ్డాడు. అయినప్పటికీ భయపడకుండా.. ప్రయాణికులను సురక్షితంగా భూమిపైకి చేర్చాడు. ఇలాంటి సమయంలోనే పైలట్లు అప్రమత్తంగా ఉంటారు. ఎందుకంటే వేల అడుగుల ఎత్తులో ప్రయాణించే విమానం విషయంలో ఎలాంటి అజాగ్రత్త వహించినా ప్రాణ, ఆస్తి నష్టం తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులకు తగ్గట్టే పైలట్లు కూడా శిక్షణలో మానసికంగా ఆరితేరి ఉంటారు. అదే వారిని ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉండేలా చేస్తుంది. అచ్చం అలాంటి సంఘటనే అక్కడ జరిగింది.
ఈక్వెడార్‌లో ఓ విమానం గాల్లో ప్రయాణిస్తోంది. మరికొద్ది సేపు అయితే చేరాల్సిన గమ్యం వస్తుంది. ఇంతలో ఒక హఠాత్పరిణామం సంభవించింది. విమానం 10,000 అడుగుల ఎత్తులో ఎగురుతుండగా.. ఓ భారీ పక్షి ఢీకొట్టింది. దీంతో విమానం యొక్క విండ్ షీల్డ్ బాగా దెబ్బతింది. దీంతో ఆ పక్షి కాక్‌పిట్‌లో ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో విమానం నడుపుతున్న పైలట్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ముఖంపై గాయాలై రక్తం కూడా కారుతూ ఉంది. అయినప్పటికీ ఆ పైలట్ భయపడలేదు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కాక్ పిట్‌లో ఉన్న కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో అవి బయటికి రావడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
విమానం 10 వేల అడుగుల ఎత్తులో ఉన్నపుడు ఈ ప్రమాదం జరిగింది. అయితే అంత ఎత్తుకు పక్షులు ఎలా ఎగురుతాయనే సందేహం రావచ్చు. అది ఆండియన్ కాండోర్ అనే ఒక రకమైన పక్షి. ఇది చాలా ఎత్తు వరకు కూడా ఎగరగలదని కొంతమంది చెబుతున్నారు. ఇలాంటి పక్షులు గాలిలో 21వేల 300 అడుగుల ఎత్తు వరకు కూడా ఎగురుతాయని పేర్కొన్నారు. ఈ పక్షి దక్షిణ అమెరికా కాథర్టిడ్ రాబందు జాతికి చెందినట్టుగా భావిస్తున్నారు. అవి ప్రపంచంలో అతిపెద్ద ఎగిరే పక్షి అని మరికొందరు చెబుతున్నారు. అయితే అంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ పైలట్ ధైర్యంగా విమానాన్ని.. సురక్షితంగా ల్యాండ్ చేశాడు. దీంతో పైలట్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. విమానంలో ఉన్న ప్రయాణికుల ప్రాణాలు రక్షించినందుకు ఆ పైలట్‌కు సెల్యూట్ చేస్తున్నారు.