నేతలపై తమ అభిమానులు పెంచుకొనే అభిమానం అంతా ఇంతా కాదు. అలాంటి ఘటనే తాజాగా చర్చాంశనీయంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ఛరిష్మా చాలా ప్రత్యేకమైనది. పార్టీలకు అతీతంగా ఆయనను అభిమానించేవారు కూడా ఉంటారు. అయితే ఓ అభిమాని మాత్రం మోదీపై తనకు ఉన్న ఇష్టాన్ని ప్రత్యేకంగా చాటుకున్నారు. మోదీ పేరు మీద తన కారుకు నంబర్ ప్లేట్ తీసుకున్నాడు. ఆ వ్యక్తి ప్రవాస భారతీయుడు కావడం మరో విశేషం. అమెరికాలోని మేరీల్యాండ్‌లో నివసించే రాఘవేంద్ర అనే వ్యక్తి తన కారు నంబర్ ప్లేటును NMODI గా రాసుకున్నారు. ఇది నరేంద్ర మోదీకి షార్ట్‌కట్. తాను 2016 లోనే ఈ నంబర్ ప్లేట్‌ను తయారు చేయించినట్లు రాఘవేంద్ర వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు స్ఫూర్తి అని తెలిపారు. సమాజం, దేశం, ప్రపంచం కోసం ఏదైనా మంచి చేయాలనే ఆలోచన మోదీ నుంచే తాను అలవాటు చేసుకున్నానని పేర్కొన్నారు. తాజాగా ప్రధాని మోదీ అమెరికాకు రావడం సంతోషంగా ఉందని.. ఆయనను ఆహ్వానించేందుకు వేచి చూస్తున్నట్లు రాఘవేంద్ర చెప్పారు. అయితే వచ్చే వారం అమెరికాలో ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ప్రవాస భారతీయులు ఎదురుచూస్తున్నారు.
జూన్ 21 నుంచి 24 వరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు మోదీ అమెరికా వెళ్లనున్నారు. ఇందులో భాగంగానే అమెరికా కాంగ్రెస్‌లో ప్రధాని రెండోసారి ప్రసంగించనున్నారు. ప్రధాని అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ముందు.. భారత జెండా ఎగురవేశారు. దీనిపై స్పందించిన న్యూజెర్సీకి చెందిన ప్రవాస భారతీయుడు జెసల్ నార్.. అమెరికా వైట్‌హౌస్ వద్ద భారత మువ్వన్నెల పతాకం రెపరెపలాడటం గర్వంగానూ, గౌరవంగానూ ఉందని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికేందుకు అమెరికాలోని ప్రవాస భారతీయులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. టైమ్స్ స్క్వేర్, నయాగరా ఫాల్స్ వంటి ప్రఖ్యాతిగాంచిన ప్రాంతాల నుంచి ప్రవాస భారతీయులు వెల్ కమ్ విషెస్ చెబుతున్నారు. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన భారతీయ యువత.. ప్రధానిని ఆహ్వానిస్తూ సోషల్ మీడియాల్లో పోస్టులు పెడుతున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా స్పందించిన అమెరికాలోని భారత దౌత్యవేత్త తరణ్ జిత్‌సింగ్ సందు.. ఈ పర్యటనతో భారత్-అమెరికా సంబంధాలు మరో స్థాయి చేరుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రధాని అమెరికా పర్యటనలో భాగంగా కీలక ఒప్పందానికి ముందడుగు పడే అవకాశం ఉందని అమెరికా వర్గాలు వెల్లడించాయి. మోదీ పర్యటనలో భాగంగా సైనిక డ్రోన్ల ఒప్పందాన్ని పూర్తిచేసే అవకాశాలు ఉన్నాయని.. ఆ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు పేర్కొన్నారు.