ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మన దాయాదీ దేశానికి... చైనా బాసట

international |  Suryaa Desk  | Published : Wed, Jun 21, 2023, 09:32 PM

శత్రు శత్రువు మన మిత్రుడు  అన్నట్లుగా చైనా వ్యవహరిస్తోంది. ముంబయి మారణహోమం సూత్రధారి, లష్కరే తొయిబాకు చెందిన కరుడగట్టిన ఉగ్రవాది సాజిద్ మీర్‌ను ఐక్యరాజ్యసమితి బ్లాక్ లిస్ట్‌లో చేర్చడానికి భారత్ చేసిన ప్రయత్నాలకు చైనా మోకాలడ్డింది. దీంతో తీవ్రంగా స్పందించిన భారత్.. చైనా చర్యలను ఖండించింది. ‘చాలా సభ్య దేశాలు మద్దతు ఇచ్చినప్పటికీ.. ఈ ప్రతిపాదన విజయవంతం కాకపోతే, తీవ్రవాదంపై అంతర్జాతీయ పోరాటం ఆర్కిటెక్చర్‌లో నిజంగా ఏదో తప్పు ఉందని నమ్మడానికి మాకు న్యాయమైన కారణాలు ఉన్నాయి... అల్పమైన భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను నిషేధిత జాబితాలోకి చేర్చలేకపోతే.. మనకు ఉగ్రవాదంపై పోరాడే నిజమైన రాజకీయ సంకల్పం మనకు లేనట్టే’ అని చైనాపై ఘాటు వ్యాఖ్యలు చేసింది.


‘ఈ రోజు జవాబుదారీతనం, పారదర్శకత ఉన్న నిషేధిత జాబితా ప్రతిపాదనలను ఎటువంటి కారణం చెప్పకుండా బ్లాక్ చేయవచ్చా? అజ్ఞాతవాసి ముసుగులో ప్రతిపాదనలను సమర్పించడానికి అనుమతించగలమా? ’ అని భారత్ ప్రశ్నించింది. ఈ సందర్భంగా ముంబయి మారణహోమం సమయంలో ఉగ్రవాదులతో సాజిద్ జరిపిన సంభాషణ ఆడియోను కూడా భారత్ విడుదల చేసింది. ‘దయచేసి ఉగ్రదాడి జరుగుతున్నప్పుడు రికార్డ్ చేసిన ఈ సంభాషణలు వినండి.. తాజ్ హోటల్‌లో విదేశీయులను వేటాడి విచక్షణారహితంగా చంపడానికి ఉగ్రవాదులకు ఫోన్‌లో సాజిద్ మీర్ దిశానిర్దేశం చేస్తున్నాడు.. ఉగ్రవాదంలో అనుకోకుండా మతం లేదా ఒక రకమైన మతపరమైన ఫోబియా చొప్పించడం కోసం పెరుగుతున్న అయోమయ ధోరణిగా పరిగణించాలి’ అని భారత్ కోరింది.


‘ప్రపంచంలోని అన్ని మతాలకు నిలయమైన భిన్నత్వంలో ఏకత్వ ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్యం వహించే మేము ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక పోరాటం ఆర్కిటెక్చర్ అన్ని మతాలను సమానంగా పరిగణించాలి.. ఒక మతం కంటే మరొక మతాన్ని ఉన్నతీకరించడానికి ఉద్దేశించిన ఏదైనా ఆలోచనను నివారించాలని మేం భావిస్తున్నాం’ అని భారత్ ఉద్ఘాటించింది. సాజిద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని కోరుతూ భారత్‌, అమెరికా సంయుక్తంగా ప్రతిపాదన సిద్ధం చేశాయి. దీనిని ఐరాస భద్రతా మండలికి చెందిన ‘1267 అల్‌ఖైదాపై ఆంక్షల కమిటీ’సమావేశంలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించగా చైనా అడ్డుపుల్ల వేసింది. దీంతో మరోసారి ఉగ్రవాదం విషయంలో డ్రాగన్ ద్వంద్వ వైఖరి బయటపడింది.


పాక్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో సాజిద్‌ మీర్‌ 2001 నుంచి కీలకంగా వ్యవహరిస్తున్నాడు. 2006 నుంచి 2011 మధ్య లష్కరే తొయిబా విదేశాల్లో జరిపిన ఉగ్రదాడులకు మీర్‌ నాయకత్వం వహించాడు. ఇక, 2008 సంవత్సరం ముంబయిలో చోటుచేసుకున్న 26/11 పేలుళ్లకు ఇతడే కీలక సూత్రధారి. ఇప్పటికే సాజిద్‌ మీర్‌పై అమెరికా 5 మిలియన్‌ డాలర్లు రివార్డు కూడా ప్రకటించింది.


గతంలో సాజిద్‌ మీర్‌ చనిపోయినట్లు పాకిస్థాన్‌ బుకాయించింది. కానీ, పాక్ మాటలు నమ్మని పశ్చిమ దేశాలు.. మృతిపై ఆధారాలు చూపించాలంటూ డిమాండ్‌ చేశాయి. దీంతో అడ్డంగా దొరికిపోయిన పాకిస్థాన్.. గత ఏడాది జూన్‌లో అతడ్ని అరెస్ట్ చేసి 15 ఏళ్ల జైలుశిక్ష విధించింది. మరోవైపు, భారత్‌ కూడా సాజిద్‌ను మోస్ట్‌వాంటెడ్‌ జాబితాలో చేర్చింది. గతేడాది సెప్టెంబరులో మొదటిసారిగా సాజిద్‌ను నిషేధిత జాబితాలోకి చేర్చే ప్రతిపాదనలకు ఇలాగే చైనా అడ్డుకుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa