భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో యాత్ర నిర్వహించే బస్సుకు గురువారం ఉదయం విశాఖ జిల్లా, పాయకరావుపేటలోని పాండురంగ స్వామి ఆలయం ఆవరణలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో పార్టీ నాయకులు ప్రసంగిస్తారు. తరువాత బస్సు యాత్రను ప్రారంభిస్తారు. పాయకరావుపేటలో డాక్టర్ అంబేడ్కర్, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు నక్కపల్లి మండలం ఉద్దండపురంలో మెగా వాటర్ స్కీమ్ వద్ద సెల్ఫీ చాలెంజ్ చేస్తారు. అనంతరం మీడియాతో మాట్లాడతారు. భోజన విరామం తరువాత మూడు గంటలకు నక్కపల్లి, అడ్డరోడ్డు, ధర్మవరం గ్రామాల మీదుగా బస్సు యాత్ర సాగుతుంది. సాయంత్రం ఐదు గంటలకు ఎస్.రాయవరంలో రచ్చబండ నిర్వహిస్తారు. రాత్రి ఏడు గంటలకు ఎస్.రాయవరం మండలం జేవీ పాలెంలో మహిళలతో సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి ఇదే గ్రామంలో బస చేస్తారు. రోజుకో అసెంబ్లీ నియోజకవర్గం చొప్పున బస్సు యాత్ర నిర్వహిస్తారు. 23న ఎలమంచిలి, 24న నర్సీపట్నం, 25న చోడవరం, 26న మాడుగుల నియోజకవర్గాల్లో బస్సు యాత్ర కొనసాగుతుంది. అనంతరం విజయనగరం జిల్లాలోకి ప్రవేశిస్తుంది.