ఏలూరు జేవీయర్ నగర్‌లో నివాసముంటున్న ఫ్రాన్సిక దుగ్గిరాల సమీపంలోని దంత వైద్య కళాశాలలో రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో మనస్పర్థలు రావడంతో విడిపోయి రెండేళ్లుగా తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఈ నెల 13న విధులకు హాజరై ఏలూరులోని సోదరి ఇంటికి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై యాసిడ్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఈ ఘటనలో ఆమె తలకు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ఫ్రాన్సికను తొలుత విజయవాడ ప్రభుత్వాస్పత్రికి, మెరుగైన చికిత్స నిమిత్తం మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. వారం రోజులుగా మృత్యువుతో పోరాడుతూ చివరకు మంగళవారం రాత్రి కన్నుమూసింది. ఆమె మృతదేహాన్ని స్వస్థలమైన దెందులూరుకి తీసుకువచ్చారు. పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. తన కుమార్తె హత్యకు కారకులైన ప్రతి ఒక్కరిని శిక్షించి న్యాయం చేయాలని ఫ్రాన్సిక తల్లి ధనలక్ష్మి డిమాండ్ చేసింది.